కోలీవుడ్ నుంచి జార్జి కోట.. తలైవి ప్రస్థానం వివాదాలతోనే... | From Kollywood to Fort St George jayalalithaa life story.

Jayalalitha kollywood to politics life

Jayalalithaa's life, Jayalalithaa's Biography, Tamil Nadu Chief Minister, Jayalalithaa History, Jayakumar Jayalalitha, jayalalitha real name, Story behind Jayalalithaa, Jayalalithaa death, Jayalalithaa Demise, Jayalalithaa passes away, Jayalalithaa controversial life, Jayalalithaa Guru, Jayalalitha Rare Pics, Jayalalithaa's life time, Jayalalitha political life, Puratchi Thalaivi, Jayalalithaa real name

A timeline of Jayalalithaa's life in film and politics.

స్పెషల్: విప్లవ నాయకి జీవితం మొత్తం వివాదాలే...

Posted: 12/06/2016 08:20 AM IST
Jayalalitha kollywood to politics life

నటిగా, పురట్చితలైవిగా, అమ్మగా, సంచనాలకు మారు పేరుగా, దేశ రాజకీయాల్లో ఓ కొత్త ఒరవడిని సృష్టించిన ఘనత జయరాం జయలలితకే దక్కుతుంది. ఒక నిర్ణయాన్ని నిర్భయంగా, నిష్పక్షపాతంగా తీసుకోవడంలో ఆమెకు సాటి మరొకరు లేరు. కేంద్రంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా, ఉపసంహరించుకునే రీతిలో కన్నెర్ర చేసినా రాజకీయంగా ఆమె రూటే సెపరేటు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చేసిన సాహసం, తీసుకున్న నిర్ణయం ఐదుసార్లు అధికార పీఠాన్ని ఆమె చెంతకు దగ్గరకు చేర్చింది. పేద ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చిన జయ... సామాన్యుల గుండెల్లో అమ్మగా నిలిచిపోయారు. పసి ప్రాయం నుంచే ఊహించని మలుపులు, వివాదాలు ఇలా కొనసాగింది ఆమె జీవితం. మరి ఆ గమనం, సంచనాలు, ప్రత్యేక శైలి గురించి ఓసారి ముచ్చటించుకుందాం.

బాల్యం...
1948 ఫిబ్రవరి 24న ఆనాటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలకోటేలో వేదవల్లి, జయరాం దంపతులకు ఆమె జన్మించారు. ఆమె తల్లిదండ్రులు తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినవారు. జయ అసలు పేరు కోమలవల్లి. అప్పటి బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం రెండు పేర్లు పెట్టేవారు. మొదటిది వారి అమ్మమ్మ పేరు కాగా... రెండోది వాడుక పేరు. ఈ క్రమంలో జయలలిత అనే పేరును ఆమెకు ఒక్క ఏడాది వయసు ఉన్నప్పుడు. (ఆమె రెండు ఇళ్లలో ఉండేవారని, వాటి పేర్లను కలిపి పెట్టారని కూడా చెప్పుకుంటారు).

jayalalithaa rare

జయలలిత తాత (తండ్రి తండ్రి) నరసింహన్ రంగాచార్య మైసూరు రాజు మహారాజా కృష్ణరాజ వడియార్ (నాలుగు)కు ఆస్థాన వైద్యుడిగా సేవలందించారు. ఆమె తల్లి తండ్రి రంగస్వామి అయ్యంగార్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో పనిచేయడానికి శ్రీరంగం నుంచి మైసూరుకు వెళ్లారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె వేదవల్లిని నరసింహన్ రంగాచారి కుమారుడు జయరాంకు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి జయకుమార్ అనే కుమారుడితో పాటు జయలలిత జన్మించారు.

Jayalalithaa

జయలలిత తండ్రి జయరాం లాయర్ అయినప్పటికీ ఏ పనీ చేయకుండా... డబ్బునంతా ఖర్చు చేసేవారు. జయకు రెండేళ్ల వయసున్నప్పుడు ఆయన చనిపోయారు. దీంతో, 1950లో తన పిల్లలను తీసుకుని బెంగళూరులోని తండ్రి వద్దకు వేదవల్లి వెళ్లారు. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ నేర్చుకున్న వేదవల్లి.. క్లర్క్ గా పనిచేశారు. వేదవల్లి చిన్న చెల్లెలు అంబుజవల్లి ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తూనే డ్రామాల్లో నటిస్తుండేవారు. ఆమె పిలుపుమేరకు వేదవల్లి కూడా మద్రాసుకు షిఫ్ట్ అయి ఆమెతోనే 1952 వరకు ఉన్నారు. ఒక కంపెనీలో పనిచేస్తూనే, మరోవైపు సినిమాల్లో అవకాశాల కోసం ఆమె ప్రయత్నించారు. ఈ సమయంలో మైసూరులో ఉన్న వేదవల్లి మరో చెల్లెలు పద్మవల్లి, ఆ తర్వాత బెంగళూరులో ఉన్న తల్లిదండ్రులు జయలలితను సంరక్షించారు.

.Jayalalithaa Schooling pic

Jayalalithaa schooling photo

టెన్త్ లో స్టేట్ ఫస్ట్...
ఈ క్రమంలో, సినీ రంగంలోకి ప్రవేశించిన వేదవల్లి... సంధ్య అనే పేరుతో సినిమాల్లో నటించడం మొదలెట్టారు. 1958లో జయలలితను చెన్నై తీసుకెళ్లారు ఆమె తల్లి వేదవల్లి. బెంగళూరులో బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ లో చదివిన జయ... చెన్నైలో చర్చ్ పార్క్ ప్రెజెంటేషన్ కాన్వెంట్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. స్కూల్లో జయ మెరుగైన విద్యార్థిగా ఉన్నారు. ఆమె ప్రతిభను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం... తదుపరి చదువుల కోసం స్కాలర్ షిప్ ను కూడా మంజూరు చేసింది. 10వ తరగతిలో తమిళనాడు రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు జయకు గోల్డ్ స్టేట్ అవార్డు దక్కింది. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో జయలలిత అనర్గళంగా మాట్లాడగలరు. ఆమె సోదరుడు జయకుమార్, అతని భార్య విజయలక్ష్మి, అతని కుమార్తె దీపలు చైన్నైలోని టీనగర్ లో నివసించేవారు. 1995లో జయకుమార్ చనిపోయారు.

Jayalalitha state first

నర్తకి నుంచి నటిగా ప్రమోషన్... 
చెన్నైలో క్లాసికల్ మ్యూజిక్, వెస్టర్న్ క్లాసికల్ పియానో, భరతనాట్యం, మోహిణిఅట్టం, మణిపురి, కథక్ లాంటివాటిని జయ నేర్చుకున్నారు. 1960లో రసిక రంజని సభలో తన తొలి డ్యాన్స్ ఫర్మామెన్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ హాజరయ్యారు. జయ నాట్యం చూసిన శివాజీ... ఈ అమ్మాయి కచ్చితంగా ఫిలిం స్టార్ అవుతుందని ఆనాడే చెప్పారట. 1961లో జయ సినీరంగ ప్రవేశం చేశారు. 13 ఏళ్ల వయసులో 'శైల మహాత్మే' అనే కన్నడ సినిమాలో ఆమె నటించారు. ఈ సినిమాలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, ప్రముఖ నటి కృష్ణకుమారిలు నటించారు. 1964లో 15 ఏళ్ల వయసులో ఆమె తొలిసారి హీరోయిన్ గా నటించారు. కన్నడ సినిమా 'చిన్నద గోంబె'లో కల్యాణ్ కుమార్ సరసన యాక్ట్ చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి ఆమె అందుకున్న పారితోషికం రూ. 3 వేలు. ఆ సమయంలో ఆమె పీయూసీ చదువుతున్నారు. వాస్తవానికి లాయర్ కావాలనే కోరిక జయకు అధికంగా ఉండేది.

Jayalalitha classical dancer

సినీ ప్రస్థానం...

1964లో తమిళ డ్రామా 'అండర్ సెక్రటరీ'లో ఆమె సేల్స్ గర్ల్ పాత్ర వేశారు. తన తల్లి అందులో లీడ్ రోల్ పోషించారు. జయ సరసన చో రామస్వామి నటించారు. 1965 నాటికి సినీ పరిశ్రమలో జయ పేరు వినిపించడం మొదలైంది. ఇదే సమయంలో తన తల్లి ఆర్థిక స్థితి కొంచెం దారుణంగా తయారైంది. దీంతో, సినిమాల్లో వస్తున్న అవకాశాల్ని వినియోగించుకోవాలంటూ జయపై ఆమె ఒత్తిడి తెచ్చారు. 1965లో 'వెన్నిర ఆడై' అనే సినిమాలో తమిళంలో ఆమె తొలిసారి లీడ్ రోల్ పోషించారు.

ఇదే సంవత్సరం తెలుగులో 'మనసులు మమతలు' సినిమాలో ఆమె తళుక్కుమన్నారు. ఈ సినిమాలో ఆమె అక్కినేని నాగేశ్వరరావుకు జోడీగా నటించారు. తమిళ పరిశ్రమలో స్కర్టులు వేసుకుని నటించిన తొలి హీరోయిన్ జయలలితే. హిందీలో కేవలం ఒక సినిమాలో మాత్రమే నటించారు. ధర్మేంద్ర సరసన 'ఇజ్జత్' అనే సినిమాలో ఆమె యాక్ట్ చేశారు. 1965 నుంచి 1973 మధ్యకాలంలో ఎంజీఆర్ తో కలసి ఏకంగా 28 సినిమాల్లో ఆమె నటించారు. ఇవన్నీ బాక్సాఫీస్ హిట్ సినిమాలే. 1966లో జయ నటించిన 11 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. చెన్నైలోని పోయస్ గార్డెన్స్ లో ఉన్న బంగళాను 1967లో రూ. 1.32లక్షలకు జయ కొనుగోలు చేశారు.

Jayalalithaa movies

1972, 1973లో ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డును జయలలిత వరుసగా గెలుచుకున్నారు. తెలుగులో 'శ్రీకృష్ణ సత్య' సినిమాకు గాను 1973లోనే తెలుగు కేటగిరీలో ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. శివాజీ గణేశన్ తో కలసి ఆమె 17 సినిమాలు చేశారు. తన చివరి తమిళ చిత్రం 'నదియై తేడి వందా కాదల్' 1980లో విడుదలైంది. ఇదే ఏడాది ఆమె చివరి తెలుగు చిత్రం 'నాయకుడు వినాయకుడు' రిలీజైంది. ఆ ఏడాది తెలుగులో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా అది నిలిచిపోయింది. 1965-1980 మధ్య కాలంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా జయ చరిత్ర సృష్టించారు. లీడ్ రోల్స్ లో ఆమె నటించిన 125 సినిమాల్లో 119 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మొత్తం 140 చిత్రాల్లో ఆమె నటించారు. 1971 నుంచి 1975 వరకు ఆమె తమిళనాడు రాష్ట్ర ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అయితే, ఆ సంవత్సరాల్లో అవార్డులు ఇవ్వనప్పటికీ, గౌరవ సర్టిఫికేట్లు మాత్రం ఇచ్చారు.


రాజకీయ ప్రస్థానం...
1982లో ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీలో జయలలిత చేరారు. అదే ఏడాది జరిగిన ఏఐఏడీఎంకే రాజకీయ సదస్సులో 'మహిళల యొక్క గొప్పదనం' అనే అంశంపై తొలిసారి ఆమె ప్రసంగించారు. 1983లో పార్టీ ప్రచార విభాగం సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. జయకు ఇంగ్లీష్ భాషపై మంచి పట్టు ఉండటంతో ఎంజీఆర్ ఆమెను రాజ్యసభకు పంపించారు. 1984 నుంచి 1989 వరకు ఆమె రాజ్యసభ్యురాలిగా వ్యవహరించారు.

Jayalalitha politics

1984లో రామచంద్రన్ స్ట్రోక్ కు గురైనప్పుడు... ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించలేని పరిస్థితుల్లో ఎంజీఆర్ ఉన్నారంటూ... సీఎం పీఠాన్ని అధిరోహించేందుకు జయ యత్నించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని తర్వాత మూడేళ్లకు ఎంజీఆర్ చనిపోయారు. దీంతో, ఏఐఏడీఎంకే రెండుగా చీలిపోయింది. ఒక వర్గం ఎంజీఆర్ భార్య జానకికి మద్దతు ప్రకటించగా... మరో వర్గం జయకు అండగా నిలబడింది. 1988 జనవరి 7న 96 మంది ఎమ్మెల్యేల మద్దతుతో తమిళనాడు ముఖ్యమంత్రిగా జానకి బాధ్యతలు చేపట్టారు. ఆనాటి స్పీకర్ పాండియన్ ఆరుగురు ఎమ్మెల్యేలను డిస్మిస్ చేయడంతో జానకి విజయం మరింత సులువైంది. విశ్వాస పరీక్షలో జానకి విజయం సాధించారు. అయితే, కేంద్రంలో ఉన్న రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆర్టికల్ 356ను ఉపయోగించి జానకి ప్రభుత్వాన్ని కూల్చివేసి, రాష్ట్రపతి పాలనను విధించింది.

చినిగిన చీరతో జయ శపథం...
1989లో బోడినాయక్కనూర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు జయ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో జయవర్గానికి చెందిన 27 మంది గెలుపొందారు. దీంతో ఆమె ప్రతిపక్ష నేతగా సభలో అడుగుపెట్టారు. 1989లో ఏఐఏడీఎంకేకు చెందిన రెండు వర్గాలు ఏకమై, జయను తమ అధినేత్రిగా ఎన్నుకున్నాయి. 1989లో అసెంబ్లీలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. అధికార డీఎంకే సభ్యులు జయపై దాడి చేశారు. చిరిగిన చీరతో అసెంబ్లీ నుంచి జయ బయటకు వచ్చారు. తాను మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతానంటూ జయ శపథం చేశారు. ఈ సన్నివేశం తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువచ్చింది. జయకు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన సానుభూతిని తీసుకువచ్చింది.

సీఎంగా సంచలన విజయం...

రాజీవ్ గాంధీ హత్యానంతరం 1991లో జరిగిన ఎన్నికల్లో... కాంగ్రెస్ తో పొత్తు అన్నా డీఎంకేకు బాగా కలసి వచ్చింది. ఓవైపు జయపై ఉన్న సానుభూతి, మరోవైపు రాజీవ్ మరణంపై సానుభూతి. దీంతో, మొత్తం 234 సీట్లకు గాను 225 సీట్లను అన్నాడీఎంకే-కాంగ్రెస్ కూటమి కైవసం చేసుకుంది. అంతేకాదు, 39 పార్లమెంటు నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో, తమిళనాడుకు ఎన్నికైన యంగెస్ట్ సీఎంగా జయ చరిత్రకెక్కారు. ఆ తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తాము పోటీ చేసిన 168 సీట్లలో కేవలం 4 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ గెలిచింది. అంతేకాదు, బార్గూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జయ కూడా ఓటమిపాలయ్యారు. అధికార పార్టీ పట్ల వ్యతిరేకత, మంత్రులపై అవినీతి ఆరోపణలు జయపార్టీని ఓడించాయి.

వివాదాలు.. కేసులు...
ఈ సందర్భంగా జయపై కరుణానిధి డీఎంకే ప్రభుత్వం పలు అవినీతి ఆరోపణల కేసులను పెట్టింది. 1996 డిసెంబర్ 7న కలర్ టీవీ స్కాములో ఆమెను 30 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి కూడా తరలించారు. 2001 ఎన్నికల్లో జయ మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి... సంపాదనకు మించిన ఆదాయం కేసుతో పాటు, పలు క్రిమినల్ కేసుల్లో జయ ఇరుక్కుపోవడంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆమెను నిషేధించారు. అయితే, ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధించింది.

దీంతో, 14 మే 2001లో ముఖ్యమంత్రిగా జయను ఆ పార్టీ నేతలు ఎన్నుకున్నారు. ఆ తర్వాత, ముఖ్యమంత్రి పదవికి ఆమె నియామకాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీంతో తన విధేయుడు పన్నీర్ సెల్వంకు సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించారు. అనంతరం మార్చ్ 2003లో ఆమె మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. మద్రాస్ హైకోర్టు చేసిన కొన్ని సూచనల మేరకు ఉపఎన్నికలో పోటీ చేసి, ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె కోసం పార్టీ ఎమ్మల్యే ఒకరు తన స్థానాన్ని త్యాగం చేశారు.

2011లో జయ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మొత్తం 13 పార్టీలు అన్నాడీఎంకేతో కలసి ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. రూ. 66.65 కోట్ల అక్రమాస్తుల కేసులో ఆమెను బెంగళూరులోని స్పెషల్ కోర్టు జడ్జి జాన్ మైఖేల్ దోషిగా నిర్ధారించారు. దీంతో, ఆమె ఆటోమేటిక్ గా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. పన్నీర్ సెల్వం మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఈ క్రమంలో, 2014లో గత 18 ఏళ్లుగా ఆమెపై ఉన్న అక్రమార్జన కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఆమెకు ఊరట లభించింది. అనంతరం ఈ కేసుల నుంచి జయలలిత నిర్దోషిగా విడుదలయ్యారు. అనంతరం మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించారు.

అవే అమ్మకు బలం...

ప్రజా హితాన్ని కాంక్షించే పథకాల్ని ప్రవేశ పెట్టడంలో జయలలిత దిట్ట. గతంలో ఆమె ప్రవేశ పెట్టిన ఉయ్యాల బేబి పథకం నుంచి నేటి అమ్మ పథకాలన్నీ ప్రజాకర్షణ మంత్రాలే. ఇక రాష్ట్రంలో మహిళా పోలీసుస్టేషన్లకు పెద్ద పీట వేసిన ఘనతఆమెకే దక్కుతుంది. పేదల్ని దృష్టిలో పెట్టుకుని ప్రవేశ పెట్టిన అమ్మ పథకాలు ఆమెను మళ్లీ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టడంలో ఆమెకు కలిసి వచ్చిన అంశం. అధికార పగ్గాలు చేపట్టినప్పుడల్లా మహిళా సాధికారత ధ్యేయంగా ఆమె ప్రవేశ పెట్టే పథకాలు మరో ప్రత్యేకత. 2014 లోక్‌సభ ఎన్నికల్లో, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతోనే తన పొత్తు అన్నట్టుగా ముందుకు సాగిన అమ్మకు అన్నీ విజయాలే. 2016 ఎన్నికల్లో సైతం ఘన విజయం సాధించి జయ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఎంజీఆర్ తర్వాత వరుసగా రెండుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఘనతను జయలలిత సాధించారు.

Jayalalithaa politics

అనారోగ్యం... నిష్క్రమణ
గత సెప్టెంబర్ 22న జయలలిత అనారోగ్యానికి గురయ్యారు. జ్వరం, డీహైడ్రేషన్ తో ఆమె అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆమెను చూడ్డానికి హాస్పిటల్ లోపలకు కూడా ఎవరినీ అనుమతించలేదు. ఆమె బాగానే ఉన్నారంటూ కేవలం హెల్త్ బులెటిన్లు మాత్రమే విడుదల చేశారు. దేశంలోని అత్యుత్తమ వైద్యులు, లండన్ వైద్యుడు రిచర్డ్ లు ఆమెకు చికిత్స అందించారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడింది... ఆమె ఆసుపత్రి నుంచి విడుదల అవుతున్నారంటూ అన్నా డీఎంకే ప్రకటించింది.

Jayalalitha last days

ఇంతలోనే, ఆదివారం (డిసెంబర్ 4) సాయంతం ఆమె కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. వెంటనే ఆమెను ఐసీయూకు తరలించారు. ఆమెను బతికించేందుకు వైద్యులు ఎంతో ప్రయత్నించినప్పటికీ... ఫలితం దక్కలేదు. చివరకు సోమవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారని వైద్యులు చివరకు అధికారికంగా ప్రకటించారు. దీంతో, తమిళనాడు గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు. అమ్మ ఇక కనిపించదన్న వార్త ఇంకా జీర్ణంచుకోలేకపోతున్నారు. ఒక 'ధృవ తార' తన అలుపెరుగని ప్రయాణాన్ని ముగించి, నింగికెగసింది. ఆమెకు తెలుగు విశేష్ తరపున నివాళులు తెలియజేస్తున్నాం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  Puratchi Thalaivi  

Other Articles