Greater hyderabad bifurcation into 3 municipal coperations

greater hyderabad, GHMC, greater Hyderabad municipal corperation, bifurcation, 3 municipal coperations, Telangana Government, proposals

greater hyderabad bifurcation into 3 municipal coperations, Telangana Government considering the proposals

గ్రేటరే.. మూడు భాగాలు కానుంది.. ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు

Posted: 11/28/2014 07:02 PM IST
Greater hyderabad bifurcation into 3 municipal coperations

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మూడు కార్పోరేషన్లుగా విభజించే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నల్లు సంకేతాలు అందుతున్నాయి. కొద్ది రోజుల క్రితం తెరపైకి వచ్చిన ఈ ప్రతిపాదన సాధ్యం కాదని సంబంధిత నిపుణులు అభిప్రాయపడినా.. ఈ ప్రతిపాదనలకే ప్రభుత్వం మొగ్గుచూపుతోందని, దాంతో మరోమారు కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ ఉమ్మడి రాజధానిగా ఉన్న నేపథ్యంలో ఇది అసాధ్యమని ఓ వైపు నిపుణులు అంటుండగా... ప్రభుత్వం మొగ్గుచూపుతున్న నేపథ్యంలో సాధ్యసాధ్యాలపై నిపుణుల బృందం పరిశీలిస్తోంది.

గ్రేటర్ ను మూడు బాగాలుగా విభజించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలపై నిపుణుల బృందం అధ్యయనం చేసి నివేదికను సమర్పించినట్లు సమాచారం అందుతోంది. దీనిని మూడుగా విభజించాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. జీహెచ్‌ఎంసీని ఢిల్లీ, ముంబయ్‌ల తరహాలో రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా విభజించాలనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో వెల్లడించారు. తాజా సమాచారం మేరకు జీహెచ్‌ఎంసీని మూడు (నార్త్, సెంట్రల్, సౌత్‌లుగా) కార్పొరేషన్లుగా విభజించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు కార్పోరేషన్లుగా విభజించినా.. ఎంఐఎం, టీడీపీల వశమవుతాయన్న ఆందోళన నేపథ్యంలో మూడు కార్పోరేషన్లకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ అవసరాలు, వివిధ పార్టీల బలాబలాలు, తమతో కలిసివచ్చే పార్టీలు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని మూడు కార్పోరేషన్లుగా విభజిస్తేనే మేలన్న యోచనలో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకనుగుణంగా ప్రతిపాదనల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో తమ జెండాను ఎగురవేయాలనే కృతనిశ్చయంతో ఉన్న టీఆర్‌ఎస్.. జీహెచ్‌ఎంసీగా ఒక్కటే ఉంటే విజయావకాశాలు సులువు కాదనే భావనతో మూడు భాగాలుగా విభజించాలని మొగ్గు చూపుతునట్లు సమాచారం. ప్రస్తుతం నగరంతో పాటు పలు శివారు నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా వుండటం.. వారిని ఢి కోనేందుకు అధికార పార్టీకి అంతస్థాయిలో బలం లేని పరిస్థితి నెలకొంది. కేంద్రంలోని అధికార బీజేపీతో పొత్తు.. గ్రేటర్ ఎన్నికల్లోనూ మైత్రి కొనసాగుతుందని ప్రకటించిన నేపథ్యంలో.. నగరంలోనూ మోడీ మానియా కోనసాగి యువత ప్రభావితయ్యే అవకాశముందని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నగరంలో ఎంఐఎం పార్టీతో పోత్తు పెట్టుకుని విజయం సాధించాలన్నా.. పలు ఇబ్బందులను అధికార పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది.

జీహెచ్‌ఎంసీ పాలక మండలి గడువు డిసెంబర్ 3తో ముగుస్తున్న నేపథ్యంలో అప్పటి వరకు నిరీక్షించి..  తరువాత విభజన  చర్యలు వేగవంతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేలోగానే దీన్ని పూర్తి చేయనున్నారు. విభజన లేకపోయినా ఇప్పటికిప్పుడు పాలకమండలి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు లేవు. వార్డుల డీలిమిటేషన్.. బీసీల గణన పూర్తి కావాల్సి ఉంది. వీటిని పూర్తిచేసి ఎన్నికలు నిర్వహించాలంటే ఎంతలేదన్నా ఆరు నెలలు పడుతుంది. డీలిమిటేషన్‌పై జీహెచ్‌ఎంసీకి ఇంకా మార్గదర్శకాలు అందలేదు. ఈలోగా జీహెచ్‌ఎంసీ విభజన ప్రక్రియ పూర్తి చేయాలన్నది సర్కారు యోచన.

దీంతొ పాటు వార్డుల సంఖ్యను పెంచాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 150 కార్పోరేటర్ స్థానాలున్న గ్రేటర్ వార్డులను సుమారుగా 200 వరకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. కార్పోరేటర్ల సంఖ్య పెరగడంతో పాటు డీ లిమిటేషన్ లోనూ జోక్యం కల్పించుకుని తమకు పట్టున్న ప్రాంతాలలో నూతనంగా వార్డులను ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. నగరంలో టీడీపీ అధిపత్యానికి బ్రేకులు వేయాలని, ప్రధాని నరేంద్రమోడీ మానియాను నిలువరించి.. తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని యోచిస్తోంది. ఇందుకు అనుగూణంగా శాసనసభ సమావేశాల తరువాత.. గత రెండు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ప్లీనరీ సమావేశాలతో నగరంపై పట్టును సాధించాలని ప్రణాళిక రచిస్తోంది. మొత్తానికి గ్రేటర్ ను విభజించి తన పట్టు సాధించుకునేందుకు అధికార పార్టీ తహతహలాడుతోంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles