Telangana assembly motion on ntrs name for rajiv gandhi international airport terminal

telangana assembly, airport, ntr name, domestic terminal, motion, KCR, JanaReddy, kishan Reddy, errabelli dayakar rao, madhusudhana chary

telangana assembly motion on ntrs name for rajiv gandhi international airport terminal

యదాతధంగా ఉంచాలని ఏకగ్రీవ తీర్మాణం

Posted: 11/21/2014 03:49 PM IST
Telangana assembly motion on ntrs name for rajiv gandhi international airport terminal

శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్ పేరు మార్పు అంశంపై తెలంగాణ శాసనసభలో వాడి వేడి చర్చ జరిగింది. శాసనసభాపక్ష నేతల నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడం విచారకరమని కేసీఆర్ అన్నారు. పేరు మార్చాలన్న ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయం తీసుకోలేదని పేర్కొన్నారు. తమ అభిప్రాయం తీసుకోకపోవటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పేరు మార్పు విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని సభలో కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ పేరు పెట్టడంపై ఇక్కడ చర్చ జరగడంలేదని, పక్క రాష్ట్రంవారి పేరు పెట్టడంపైనే చర్చ జరుగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ను అగౌరవ పరచాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షనేత జానారెడ్డి మాట్లాడుతూ... గతంలో ఉన్న రాజీవ్‌గాంధీ పేరును కొనసాగించాలని, సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్నట్లు తెలిపారు.

దేశీయ టెర్మినల్‌కు గతంలో ఎన్టీఆర్ పేరు ఉందని, వైఎస్ ప్రభుత్వం కావాలనే ఎన్టీఆర్ పేరు తొలగించిందని టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. రాజీవ్‌గాంధీ పేరు తొలగించి ఎన్టీఆర్ పేరు పెట్టలేదని, అంతర్జాతీయ టెర్మినల్‌కు రాజీవ్‌గాంధీ పేరే ఉందని వెల్లడించారు. బేగంపేట విమానాశ్రయాన్ని శంషాబాద్‌కు మార్చినప్పుడు రాజీవ్ పేరు పెట్టారని అంతకు ముందు విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు వుండేదని బీజేపి సభ్యుడు కిషన్‌రెడ్డి అన్నారు. జానారెడ్డి, జీవన్‌రెడ్డి అంతా ఎన్టీఆర్ వద్దే రాజకీయాలు నేర్చుకున్నారన్నారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానంలో మార్పులు చేయాలని సూచించారు. మన రాష్ట్రంలో అన్ని పథకాలకు రాజీవ్, ఇందిర పేర్లే పెట్టారు... కొమరం భీం వంటి ప్రముఖుల పేర్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి భావ దారిద్య్రం ఉందని విమర్శించారు. వాజ్ పాయ్ ప్రధాన మంత్రిగా వున్న హయాంలో తమిళనాడులో అన్నాదురై, అహ్మదాబాద్ లో సర్థార్ వల్లభ బాయ్ పటేల్ అని ప్రాంతీయ నేతలకు ప్రాధాన్యతను ఇస్తూ పేర్లు పెట్టిందని గుర్తు చేశారు.

సీపీఎం, వైసీపీ నేతలు మాట్లాడుతూ... యదాతథ స్థితి కొనసాగించాలని కోరారు. ఒక వేళ పేరు మార్పు చేయాల్సి వస్తే కొమరం భీంపేరు పెట్టాలని సూచించారు. సీఎం ప్రవేశ పెట్టిన తీర్మానికి కాంగ్రెస్, వైసీపీ, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ మద్దతు తెలిపాయి. తీర్మానాన్ని తెలుగుదేశం సభ్యులు వ్యతిరేకించగా, తీర్మానంలో సవరణలు చేయాలని బీజేపి సూచించింది. సీఎం తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సభాపతి ప్రకటించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles