Water affray electricity crisis war between the states of andhra and telangana

srisailam power issue, srisailam power production issue, telangana government on srisailam power issue, andhrapradesh on srisailam power production, telangana and andhrapradesh war, telugu latest news, krishna river management board

srisailam power production issue raised again, water war between telangana and andhrapradesh still continues even after krishna water board intervention. Telangana government says it will approch Supreme court

జల జగడం.. విద్యుత్ సంక్షోభం.. ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల మధ్య వాటర్ వార్

Posted: 10/25/2014 10:57 AM IST
Water affray electricity crisis war between the states of andhra and telangana

ఆంధ్రప్రదేశ్ రైతంగానికి భవిష్యత్ లో సాగునీరు ఉండదని కలవరం.. ఇటు తెలంగాణలో తీవ్ర విద్యుత్ సంక్షోభం. తెలంగాణ రైతాంగం కరెంటు లేక సాగు, తాగు నీరు లేక అర్రెలు చాస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలు.. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరికోకరు అంటే అసలు గిట్టదు. వీరిద్దరి మధ్య పొసగకపోవడం ఇరు రాష్ట్రాల రైతాంగానికి శాపంగా పరిణమించింది. కేంద్రంలో తనకు సత్తా వుందన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణలోనూ తాను అధికారంలోకి రావాలని కలలు కంటున్న సందర్భంగా ప్రధానితోనూ, కేంద్ర మంత్రి పీయూష్ కుమార్ తోనూ చర్చించి విద్యుత్ సరఫరాను అందిస్తే.. ఈ వివాదానికి తెరపడినట్లే అవుతోంది.

కానీ.. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీని తెలంగాణలో బలహీనం చేయాలని కంకణం కట్టుకున్న టీఆర్ఎస్ అధినేతి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అంటేనే ఇప్పడసలు చంద్రబాబుకు గిట్టడం లేదు. తాను మేలు చేయడానికి వెనుకాడబోను కానీ, తన పార్టీ ఉనికినే దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారా అంటూ ఆయన కూడా తెలంగాణ సర్కారుపై కక్షగట్టినట్టే వున్నారు. విద్యుత్ అంశాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టే యత్నంలో భాగంగా కేంద్రంతో ప్రేమలేఖల రాయబారం కూడా కొనసాగిస్తున్నారని ఆరోపణలు తెరపైకి వచ్చాయి. తెలంగాణ విద్యుత్‌కు ఇపుడు కీలక వనరుగా ఉన్న శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి అంశాన్ని తెరపైకి తీసుకోచ్చి అనవసర రాద్దాంతం చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు అరోపిస్తున్నాయి

సీమాంధ్ర టీడీపీ మంత్రులను కలుపుకుని తమకు నీటి కష్టాలు వస్తాయని నిరసనలు, విమర్శలకు దిగుతున్న టీడీపీ ప్రభుత్వం.. వాస్తవానికి పెన్నా బేసిన్‌లో ఉన్న రాయలసీమకు ఈ నీటిపై హక్కే లేదన్న విషయం తెలిసినా.. పదేపదే 107 జీవోను ప్రస్తావిస్తున్నారు. 107 జీవో విడుదలైన రోజున ఇదే పార్టీ నిరసనలు చేసింది. ప్రకాశం బ్యారేజీపై ధర్నాలకు దిగింది. అ సత్యాన్ని మరచి ఇవాళ కేవలం టీఆర్ఎస్ పార్టీపైనున్న కోపంతో తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలని యోచించడం సమంజసమా..?
ఈ జీవో విడుదల చేసిన సమయంలో నందిగామ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత ఏపీ భారీ నీటి పారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆ జీవో మీద మండిపడ్డారు. ఆనాడు జిల్లా పరిషత్ సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణం జీవో రద్దు చేయాలంటూ రోజంతా కార్యకలాపాలు స్తంభింపచేశారు. రైతులు తిరగబడాలని పిలుపు ఇచ్చారు. అప్పట్లో మాజీమంత్రిగా ఉన్న కోడెల శివప్రసాదరావు ఈ జీవోను నమ్మకద్రోహమని అభివర్ణించారు. అంతకుముందు జరిగిన అఖిలపక్షంలో తాను ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించానని చెప్పుకున్నారు. 40 సంవత్సరాలు సాగర్ ఆయకట్టు, 150 సంవత్సరాల డెల్టా ఆయకట్టును ఏం చేస్తారో చెప్పాలని నిలదీశానన్నారు.

మరి ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారిన తరువాత నేతల మాటలు ఎందుకు మారాయి. రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటే.. ఒక్కటిగానే కలసివుండాలి అంటున్న చంద్రాబాబు.. ఆయన మంత్రుల బృందం ఎందుకీలా కథ, స్ర్కీన్ ప్లే, డైరెక్షన్ ను మారుస్తున్నారు. ప్రజా పాలకులుగా ప్రఖ్యాతి పోందిన మీరు.. ప్రజలకు అన్యాయం చేసే పనులకు ఎలా ఒడిగడతారు. నేతలు మీకు అన్యాయం చేస్తే.. పార్టీ వీడితే.. ప్రజలపై కక్షగడతారా.. అంటూ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక మరో వైపు కేసీఆర్ ప్రభుత్వం కూడా పులిచింతల ప్రాజెక్టు వద్ద నల్గోండ జిల్లాలోని గ్రామాలు మునిగినా పట్టించుకోరా అంటూ కేసీఆర్ పై తెలంగాణ ప్రజలే ధ్వజమెత్తుతున్నారు. హుద్ హుద్ తుపాను నేపథ్యంలో అక్కడి వారిని అదుకున్నామని చెబుతున్న కేసీఆర్.. కనీసం అక్కడి ప్రజల ఆర్తిని కూడా వినిపించుకోరా సీమాంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క యూనిట్ నుంచే విద్యుత్ ను ఉత్పాదకతను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం.. నిన్న ఏకంగా మూడు యూనిట్ల ద్వారా విద్యుత్ ను ఉత్పాదన చేపట్టడాన్ని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు సైతాన్ లా దాపురించాడన్న కేసీఆర్

ఇధిలావుండగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య మాటాల యుద్దం కూడా తారా స్థాయికి చేరింది. కృష్ణా జిల్లా పర్యటనలో ముందుచూపు లేకేపోవడం చేతే తెలంగాణకు విద్యుత్ కష్టాలు వచ్చాయన్న చంద్రలబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తెలంగాణకు సైతాన్‌లా వ్యవహరిస్తున్నాడని, ఇక్కడ పంటలు ఎండబెట్టాలని కంకణం కట్టుకున్నాడని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరి బతుకు వారు బతకాల్సింది పోయి పక్కరాష్ట్రంలో నిప్పులు పోస్తున్నాడని అన్నారు. తమకు ముందు చూపు లేదన్న బాబుకు ఉన్నది దొంగచూపు మాత్రమేనన్నారు.

చంద్రబాబు చేసిన మోసానికి తెలంగాణ ప్రభుత్వం అదనపు విద్యుత్ కోసం రూ. 608 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడుతున్నామని.. ఎట్టిపరిస్థితిలోనూ తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను వదిలిపెట్టేది లేదన్నారు. చంద్రబాబు చేసిన నష్టం మీద సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తిని నిలువరించేది లేదని, పంటలను కాపాడుకోవడం తమ ప్రాధాన్యతని అన్నారు. కేటాయించిన జలా ల ప్రకారం 81 టీఎంసీల నీరును వినియోగించుకునే హక్కు తెలంగాణకు వుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఈఆర్సీ ఛీ కొట్టినా బుద్ధిరాలేదు..

విద్యుత్ పీపీఏ విషయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించారని ఏపీ ఈఆర్సీ చంద్రబాబుకు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చిందని, ఇదే విషయాన్ని కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ కూడా స్పష్టం చేసింది. అయినప్పటికీ చంద్రబాబుకు బుద్ధి రాలేదని కేసీర్ మండిపడ్డారు. చంద్రబాబు దొంగచూపుల వల్ల తెలంగాణ రాష్ట్రం కరెంటు కటకటలకు లోనవుతుంది. ఆయన మోసం వల్లనే 82 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను 4 నెలల్లోనే నష్టపోయాం ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు తెలంగాణ పాలిట సైతాన్‌లా దాపురించి ఈ ప్రాంత రైతుల ఉసురుపోసుకుంటున్నారని మండిపడ్డారు. ఇక్కడ పంటలను ఎండబెట్టాలని శపథం తీసుకొని, పంటలు ఎండేదాక నిద్రపట్టే పరిస్థితి చంద్రబాబుకు లేనట్లు ఉందన్నారు. తెలంగాణను పూర్తిస్థాయిలో మోసం చేసేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రైతులను, డ్వాక్రా మహిళలను కూడా దగా చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. దేశంలోనే నీచాతినీచంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబేనని అన్నారు.

శ్రీశైలం మీద తెలంగాణకు హక్కుందని.. అది సంయుక్త ప్రాజెక్టు. రెండు రాష్ర్టాలకు హక్కు వుంది. 97 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించారు. కల్వకుర్తికి 25 టీఎంసీలు, బీమాకు 20 టీఎంసీలు, నెట్టెంపాడు 22 టీఎంసీలు, ఎస్‌ఎల్‌బీసీకి 30 టీఎంసీలు కేటాయిస్తే ఏపీని పాలించిన ఆంధ్రా ముఖ్యమంత్రులు, సమైక్య పక్షపాతులు తెలంగాణకు న్యాయం చేయకుండా రెండు దశాబ్దాల పాటు ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం చేశారు. 20 టీఎంసీల నికర జలాలను వినియోగించుకునే అవకాశం ఉన్నా... రెండు దశాబ్దాలపాటు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నిర్మాణాన్ని కమిటీల మీద కమిటీలు వేసి జాప్యం చేసి చివరకు టన్నెల్ నిర్మాణం అంటూ కుట్రలు చేశారు. గ్రావిటీద్వారా నీరందించే అవకాశం వున్నా సకాలంలో ఆంధ్రా పాలకులు చర్యలు తీసుకోలేదు. హైదరాబాద్ నీటికి పూర్తి హక్కు ఉన్నా రిజర్వాయిర్ల దగ్గర అడుక్కుతినే స్థితికి తెచ్చారు.

తెలంగాణకు ఒక్క యూనిట్ ఇచ్చావా?: తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు తెలంగాణలో ఒక్కటంటే ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కూడా నిర్మించలేదు. మొత్తానికి మొత్తం ఆంధ్రలోనే పెట్టారు. అవీ అన్నీ ప్రైవేటు పీపీఏలే. ఇవాళ విద్యుత్ ప్రాజెక్టులు మా ప్రాంతంలో వున్నా యి.. తెలంగాణకు కరెంటు ఇవ్వనని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. పైగా హిందూజా యాజమాన్యాన్ని కూడా బెదిరించాడు. తెలంగాణ కరెంటు కొరతకు కారకుడే చంద్రబాబు. మాకు ముందు చూపుంది... ఆయనలాగా దొంగ చూపు లేదు... ఆ చూపువల్లనే తెలంగాణకు చట్టప్రకారం రావలసి న కరెంటు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలంలో ఉత్పత్తి నిలిపివేస్తే 300 మె గావాట్లు సరఫరా చేస్తామంటున్నారు. ఆయన్ను ఎలా నమ్మగలం? మేమేమైనా పిచ్చివాళ్లమా. 900 మెగావాట్లు ఉత్పత్తి చేసుకుంటున్నాం. 300 తీసుకుంటమా? అని నిలదీశారు. చంద్రబాబు జారీచేసిన జీవో 69 ప్రకారమే 834 అడుగుల నీటిమట్టం వరకు కరెంటు ఉత్పత్తి చేయవచ్చునని చెప్పారు

ఆబిడ్స్‌లో చర్చకు సిద్ధమా?: మాట్లాడితే చర్చలంటున్న డు..కరెంటుపై చంద్రబాబుతో చర్చకు సిద్ధం. రా..అబిడ్స్‌లో నెహ్రూ బొమ్మవద్ద చర్చించుకుందాం. నీ బండారం బయటపడుతుంది. లేదంటే ప్రకాశం బ్యారేజి మీద అయినా సరే..నువ్వు అక్కడి రైతులు డ్వాక్రామహిళలకు ఏం హామీలిచ్చినవో.. ఎలా దగా చేసినవో..సీడీలు కూడా పట్టుకొని వస్తానని కేసీఆర్ సవాల్ చేశారు. చంద్రబాబుది నాలుకా..? తాటిమట్టా అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో జీవో 107 ప్రకారం 834 నుంచి 854 అడుగులకు పెంచితే దానిని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు.. ఇవాళ మరో మాట మాట్లాడడం విడ్డూరంగా వుందని ఎద్దేవా చేశారు.

బాబు మోసాలకు అంతు వుండదా?

ముఖ్యమంత్రివని గౌరవమిచ్చాను..: చంద్రబాబూ.. తెలంగాణపై అంత కక్ష ఎందుకు పెట్టుకున్నావు. ఎందుకు మోసం చేస్తున్నావు. ఎంత జరిగినా ఇంతదాకా మాట్లాడలేదు.. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రివనే సంస్కారంతో గౌరవమిస్తూ వచ్చానన్నారు. జూరాలలో సకాలంలో విద్యుత్ ప్లాంట్లను పునరుద్ధరించలేదని విమర్శిస్తున్నావు. వరదలో మునిగిన యూనిట్‌వల్ల నష్టపోయింది కేవలం 80 మెగావాట్లే. అసలు ఆ ప్రాజెక్టు ఇంకా ప్రారంభమే కాలేదని తెలిపారు. బాబు హయాంలో శ్రీశైలం కుడిగట్టు పవర్ ప్రాజెక్టు మునిగిపోతే అప్పుడేం చేశావని ప్రశ్నించారు. బాబుది దుర్మార్గపు పంథఅని, ప్రపంచ చరిత్రలో ఇలాంటి మనస్తత్వం ఎవరికీ ఉండదని మండిపడ్డారు విభజన చట్ట ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో వున్న అన్ని ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 53.89 శాతం రావలసి వుంది. కానీ చట్టాన్ని ఉల్లంఘించిన చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నాడు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళుతున్నామని కేసీఆర్ వెల్లడించారు.

హిందూజా, కృష్ణపట్నం ప్రాజెక్టు నుంచి తెలంగాణకు కరెంటు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నావని బాబుపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ పంటల నష్టం చెల్లించాల్సి ఉంటుంది. జాగ్రత్త.. అని హెచ్చరించారు. :పైరవీలు చేసి కృష్ణా ట్రిబ్యునల్‌ను పిలిపించుకున్నావని. మోసకారివని దుయ్యబట్టారు. సాధారణ ఎన్నికల్లో నీవు చేసిన ప్రసంగాల వీడియో ఫుటేజి మాదగ్గర వుందని బెదిరింపులకు పాల్పడ్డారు.

ఏపీ రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసిన చీటర్ అని చంద్రబాబుపై కేసీఆర్ తీవ్రంగా ధ్వజమోత్తారు. తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశాను.. ఋణాల మాఫీ ఎలా చేయాలో తెలుసని అన్నావు. అయితే ఇప్పటికీ రైతులకు పైసా మాఫీ చేయలేదు. కథలు చెబుతున్నావు, మెలికలు పెడుతున్నావు, పరిమితి విధిస్తున్న పచ్చి మోసగాడని మండిపడ్డారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srisailam  krishna borad  telangana  andhrapradesh  power production  water storage  

Other Articles