Check on bogus certificates soon

Telangana government, check, bogus certificates, intermiediate, jagadeshwar reddy, police, special portal, KCR

Telangana government to keep check on bogus certificates

నకిలీలూ.. ఇక మీ పని చెల్లు...

Posted: 10/01/2014 10:30 AM IST
Check on bogus certificates soon

నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి ఉద్యోగాలు పొందటానికి ప్రయత్నించటం ఇక మీదట సాధ్యం కాకపోవచ్చు! ఎందుకంటే... ఇకపై పదో తరగతి నుంచి పీహెచ్‌డీ దాకా అన్ని ధ్రువపత్రాలను ఆన్‌లైన్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నకిలీ ధ్రువపత్రాలు పేరుకుపోవడం.. మెరిట్ ఆధారంగా వారికే ఉద్యోగాలు రావడం.. దీంతో అసలు సిసలైన అర్హత కలిగిన అభ్యర్థులు నిరాశ నిసృహలకు లోను కావడంతో.. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారిందింది. నకిలీ ధ్రువపత్రాలతో పలువురు ఉద్యోగాలు సంపాదిస్తున్నారని నాస్కామ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకురాగా, చర్యలు చేపట్టాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.

దీంతో రంగంలోకి దిగిన విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి.. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు, రిజిస్ట్రార్ల సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. నకిలీ ధ్రువపత్రాలను అరికట్టడానికి ఆన్‌లైన్ పద్ధతిని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. పదో తరగతి నుంచి పీహెచ్‌డీ దాకా అందుబాటులో ఉన్న అన్నింటినీ ప్రత్యేక వెబ్‌పోర్టల్ ఏర్పాటు చేసి ఆన్‌లైన్లో పెట్టనున్నట్టు తెలిపారు. దీన్ని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్వహిస్తుందన్నారు. పోలీసుల సహకారంతో సర్టిఫికెట్ ఫోర్జరీ ముఠాలపై దాడులు తీవ్రతరం చేస్తామని మంత్రి తెలిపారు. ఈ ఆన్‌లైన్ పోర్టల్‌ను పరిశ్రమలకు అనుసంధానం చేస్తామని.. తద్వారా తమ వద్ద ఉద్యోగాలకు వస్తున్న వారు చూపెడుతున్న ధ్రువపత్రాలు సరైనవో కాదో కంపెనీలు తనిఖీ చేసుకునే అవకాశం వుందన్నారు.

ఇంటర్మీడియెట్ పరీక్షల్ని తెలంగాణకు విడిగా నిర్వహించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న ఇంటర్‌బోర్డును ఇంకా విభజించలేదు. విభజనకు సంబంధించిన ప్రతిపాదనలు రెండు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు విడివిడిగా మూల్యాంకనం చేస్తున్న నేపథ్యంలో విడివిడిగా పరీక్షలు కూడా నిర్వహించాలని బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే... ఎంసెట్‌లాంటి ఉమ్మడి ప్రవేశపరీక్షల నేపథ్యంలో ఇంటర్ పరీక్షల్ని విడివిడిగా నిర్వహిస్తే కష్టమనే వాదన ఉంది. మొత్తానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆదేశాల కోసం బోర్డు ఎదురుచూస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles