Facebook page to every police station

Facebook, Telangana police, Telangana government, Friendly Police, corruption, social justice, Hyderabad police

telangana goverment to impliment friendly policing, creates facebook to every police station

పోలీసులూ.. తస్మాత్ జాగ్రత్తా.. ‘ఫేస్ బుక్’ అవుద్దీ..

Posted: 09/22/2014 12:58 PM IST
Facebook page to every police station

సోషల్ వెబ్ సైట్ లతో కేవలం టైమ్ పాస్ చేయడమే కాదు.. సరిగ్గా వాడితే.. ఎంతో మేలు చేస్తాయి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గ్రహించింది. హైదరాబాద్ నగరంలో సింగపూర్ పోలీసింగ్ తీసుకువస్తామన్న తెలంగాణ సర్కారు.. సోషల్ వబ్ సైట్ల ఆధారంగా ప్రజలకు మరింత చేరువ కానుంది. హైదరాబాద్ తో పాటు యావత్ తెలంగాణలోని పది జిల్లాలలో పోలీసు సంస్కరణలకు చేపడుతోంది. తెలంగాణలో స్నేహపూర్వక పోలీసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రజల శాంతి భద్రతలకు మరింత పెద్దపీట వేయనుంది. తెలంగాణ పోలీసుల 'ముఖచిత్రం' మార్చేవిధంగా అడుగులు ముందుకేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఫేస్‌బుక్‌లో ఒక పేజీ పెట్టి తద్వారా ప్రజలతో నిరంతరం సంబంధాలు నెలకొల్పుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన కొద్దిరోజుల్లోనే కార్యరూపం దాల్చనుంది.

హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో, తెలంగాణ జిల్లాల్లో జరగుతున్న నేరాలను, మహిళలపై అకృత్యాలను అరికట్టేందుకు కూడా ఫేస్ బుక్ దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం టెలి కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన మార్పులతో అన్ని మొబైల్ ఫోన్లలోనూ ఫేష్ బుక్ అప్షన్ వుండటం, ప్రభుత్వానికి కలసి వచ్చింది. తమ ప్రాంతంలో జరిగే నేరాలతో పాటు.. తమను తాము రక్షించుకునే సందర్భాల్లో మొబైల్ యూజర్లు ఫేస్ బుక్ ద్వారా సమాచారం అందిస్తే.. చాలు సంబంధిత పోలీసులు చర్యలకు ఉపక్రమిస్తారు. అందకనే ఫేస్ బుక్ తో పోలీసు స్టేషన్లను అనుసంధానం చేసి నేరాలను అరికట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

శాంతిభద్రతలు మెరుగ్గా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తున్న ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీస్థాయిలో నిధులు మంజూరుచేసింది. మౌలిక వసతుల కల్పనతో పాటు, భారీగా కొత్త ఉద్యోగాలూ మంజూరు చేస్తోంది. ఇప్పటికే వందలాది వాహనాలు కొనుగోలు చేస్తోంది. రూ.200 కోట్ల ఖర్చుతో బంజారాహిల్స్‌లోని ఎనిమిది ఎకరాల స్థలంలో 22 అంతస్తుల్లో దేశంలోనే అత్యాధునిక కమిషనరేట్‌ను నిర్మించేందుకు రంగం సిద్ధంచేసింది. మరో పది రోజుల్లో దీనికి పునాది పడే అవకాశం ఉంది. ఒకపక్క పోలీసుల అవసరాలు తీరుస్తూనే మరోపక్క వారి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఎన్ని వసతులు కల్పించినా పోలీసుల ప్రవర్తన మారకపోతే ఆశించిన ప్రయోజనం ఉండదన్న విషయాన్ని అధికారులూ అంగీకరిస్తున్నారు. పోలీసుల దైనందిన వ్యవహారాలను పారదర్శకం చేయడం ద్వారా వారిలో జవాబుదారీతనం పెంచవచ్చనేది వారి ఉద్దేశం. అందుకు అనువుగానే తొలి దశలో 'ఫేస్‌బుక్'ను ఆశ్రయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌కు 'ఫేస్‌బుక్'లో ఒక పేజీ రూపొందిస్తారు. ఆ ఠాణాకు సంబంధించిన వ్యవహారాలపై ఎవరైనా, ఎక్కడ నుంచయినా తమ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు.

ఎవరైనా బాధితుడు స్టేషన్‌కు వెళ్ళినప్పుడు సరిగా న్యాయం జరగలేదని, సిబ్బంది ప్రవర్తన బాగా లేదని భావించినప్పుడు ఆ స్టేషన్‌కు సంబంధించిన పేజీలో తన అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. అలానే ఏదైనా పోలీస్‌స్టేషన్‌లో అవకతవకలు జరిగినట్లు ఎవరికైనా తెలిస్తే, వాటిని కూడా ఎవరైనా, ఫేస్‌బుక్ ద్వారా పంచుకోవచ్చు. ఇది ప్రజలంతా చదివే అవకాశం ఉంది. తద్వారా తాము తప్పుచేస్తే ప్రజలకు తెలిసిపోతుందన్న భావన పోలీసులకు కలుగుతుంది.

అంతేకాదు...ఈ అభిప్రాయాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు కాబట్టి అవసరమైతే వాటిపై విచారణ జరపవచ్చు. తప్పుచేశారన్నది నిర్ధారణ అయినప్పుడు చర్యలూ తీసుకుంటారు. తమ చర్యలను ప్రజలతోపాటు పై అధికారులు కూడా గమనిస్తున్నారన్న భావన వస్తే పోలీసులు ఖచ్చితంగా తమ ప్రవర్తన మార్చుకుంటారని ఉన్నతాధికారులు గట్టిగా విశ్వసిస్తున్నారు. పోలీస్‌శాఖ సంస్కరణ చర్యల్లో భాగంగా తొలిదశలో ఫేస్‌బుక్ పేజీకి రూపకల్పన, అదయ్యాక స్నేహపూర్వక పోలీస్‌కు సంబంధించి స్టేషన్ స్థాయిలోనే మొత్తం సిబ్బందికి విడతల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇవాళ జరిగిన స్నేహపూర్వక పోలీసింగ్ పై తొలివిడద శిక్షణను ఎసై, కానిస్టేబుళ్లకు అందిస్తున్నారు. రెండు రోజుల పాటు వుండే ఈ శిక్షణా కార్యక్రమాల్లో పోలీసుల ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles