Whom should we thank nizam or patel

Home minister, Nayini NarsimhaReddy, TRS, BJP, MIM, Freedam, September 17

whom should we thank Nizam or patel ? Telangana Home minister comments araises a new question

ధన్యవాదాలు నిజాంకా..? సర్థార్ పటేల్ కా..?

Posted: 09/17/2014 01:14 PM IST
Whom should we thank nizam or patel

తెలంగాణ రాష్ట్రం సాకరమైంది.. 29 భారతీయ రాష్ట్రంగా పరిగణింప బడుతోంది. అయినా.. అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపుకునే స్వేచ్ఛకు మనం దూరమయ్యాం. తెలంగాణ విమోచన దిన్సోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ సంస్థాన్ ప్రజల స్వాతంత్ర్య దినోత్సవాన్ని సమైక్య రాష్ట్రంలో అధికారికంగా నిర్వహించకపోవడంపై ఇన్నాళ్లు మండిపడ్డ తెలంగాణవాదులు.. ఇప్పడు ఎందుకు మౌనంగా వున్నారని ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. నాటి హైదరాబాద్ సంస్థాన్ లో భాగంగా వున్న మహారాష్ట్ర, కర్నాటకలలోని జిల్లాల్లో అధికారికంగా అక్కడి ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుండగా, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విమోచన దిన్సోత్సవ సంబరాలను ఎందుకు అధికారికంగా జరపడం లేదని ప్రశ్నిస్తున్న గొంతుకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది.

సెప్టంబర్ 17 తెలంగాణ ప్రజలకు దసరా, దీపావళి

నిజాం నిరంకుశ పాలనను, అప్పటి దాష్టికాలను హైదరాబాద్ సంస్థాన ప్రజలు, వారి వారసులు ఏనాటికి మరచిపోరు. పన్ను కట్టలేదని మండుడెంటల్లో వంగోబెట్టి కడ్డీలను వీపుపై పెట్టిన సంఘటనలు అనేకం. అందంగా వున్న అమ్మాయిలను, మహిళలను ఎత్తుకెళ్లి అతిధిగృహాలతో వారి శృంగారానికి బలితీసుకన్న ఘటనలు.. ఎదురుమాట్లాడితే.. సభ్యసమాజం తలదించుకునే విధంగా బలవంతంగా మహిళలను వివస్త్రలను చేయించడం.. ఒకటి కాదు.. రెండు కాదు.. నిజాం దాష్టికాలు చెప్పుకుంటూ పోతే.. పుటలు పుటలు నిండుతాయి. మంచిపై చెడు సాధించిన విజాయాలకు హోలీ, దసరా, దీపావళి పండుగలను జరుపుకుంటున్నట్లే.. నిజాం పీడ వైదోలిన రోజును గుర్తుగా హైదరాబాద్ సంస్థాన ప్రజలు ఈ రోజున పండగ చేసుకోవాలి.

,చరిత్రను వక్రీకరిస్తున్న వైనం..

కానీ తెలంగాణ ప్రజలకు తామెన్నుకున్న ప్రభుత్వమే అడ్డుగా నిలుస్తోంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ చరిత్రను మారుస్తున్నారంటూ గగ్గోలు పెట్టిన టీఆర్ఎస్ నేతలు.. ఇప్పడు వారే చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. సెప్టబర్ 17 ప్రాముఖ్యతను తెరచాటుగా కాలగర్భంలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. తన రాజ్యాన్ని నిజాం నవాబు వదులుకుని.. భారత దేశంలో విలీనం చేశాడని, ఇందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పాలని స్వయంగా తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించడం చరిత్రను తమకు అనుకూలంగా మార్చడం కాదా..? హైదరాబాద్ సంస్థాన్ నిజాం సొంత రాజ్యామా..? అంతకు పూర్వం రాజుల చరిత్రను నాయిని మర్చిపోయినట్లు వున్నారు. హైదరాబాద్ సంస్థానానికి నిజాం నవాబులు ఎలా వచ్చారన్న చరిత్ర కూడా నాయిని తెలుసుకుంటే మంచిది.

సంస్థానాన్ని వదిలేందుక ఇష్టపడని నిజాం..

ఇంతటి పవిత్రమైన రోజున నిజాంకు ధన్యవాదాలు చెప్పాలా..? లేక 1947 లో అప్పటి  కేంద్ర హోం మంత్రిగా వున్న ఉక్కు మనిషి సర్థార్ వల్లభ భాయ్ పటేల్ కు ధన్యవాదాలు చెప్పాలా..? అన్న ప్రశ్నకు నాయిని తెర లేపారు. యావత్ భారత్ దేశ ప్రజలు స్వాతంత్ర్య ఫలాలను ఆస్వాధిస్తున్న తరుణంలో హైదరాబాద్ సంస్థాన్ ప్రజలు మాత్రం ఇంకా నిజాం రాజు అదుపాజ్ఞల్లో మగ్గుతున్నారు. భారత్ దేశం ఏర్పడడంతో నిజాం రాజు కూడా భయపడ్డారు... తన కథ ముగిసిందనుకున్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని ఏ కోశానా వదులుకోడాలనికి ఇష్టపడని నిజాం నవాబు.. ఐక్యరాజ్య సమితిలో అప్పీలు చేసుకున్నారు. హైదరాబాద్ తన సంస్థానమని, దానిని భారతదేశంలో కలపనని, ఈ మేరకు భారత్ ప్రభుత్వంతో చర్చలు నిర్వహించాలని కూడా అభ్యర్థించారు.

సర్థార్ పటేల్ ధైర్యసాహసాలతోనే..

అప్పటి భారత ప్రధాన మంత్రి జవహార్ లాల్ నెహ్రూ విదేశీ పర్యటనలో వున్న సమయంలో నిజాం నవాబు ఆగడాలు మరింత శృతిమించాయి. దీంతో రంగంలోకి దిగిన అప్పటి కేంద్ర హోం మంత్రి సర్థార్ వల్లభ బాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో భాగమేన్నారు. ఉన్న ఫల్లంగా హైదరాబాద్ సంస్థాన్ పాలకుడు నిజాం రాజుపై దండయాత్ర చేపట్టారు. హైదరాబాదుపై పోలీసు చర్య చేపట్టాడు..  హైదరాబాద్ రాజ్య సైన్యాధ్యక్షుడు జనరల్ ఎల్ అడ్రూస్ భారత సైన్యానికి చెందిన జనరల్ జేఎన్ చౌదరి ఎదుట ఆయుధాలు అప్పగించాడు. దీంతో భారత ప్రభుత్వానికి నిజాం లోంగిపోయాడు. హైదరాబాద్ సంస్థానాన్ని పటేల్ భారత్ దేశంలో కలిపాడు. అది దేశ ప్రజలకు విలీనం కావచ్చును కానీ, సంస్థాన ప్రజలకు మాత్రం నిజాం అకృత్యాల నుండి విమోచనమే.

మజ్లిస్ మద్దతు కోసమే.. టీఆర్ఎస్

మజ్లిస్ పార్టీ మద్దతు కోసమే తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా సెప్టంబర్ 17 విమోచన కార్యక్రమాలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించడం లేదన్న ఆరోపణలు ఇప్పడు ఊపందుకున్నాయి. గత ఎన్నికలలో తెలంగాణలోని పది జిల్లాలలో తొమ్మిందింట తన ఏకపక్ష సత్తాను చాటిన టీఆర్ఎస్.. హైదరాబాదులో మాత్రం బలం నిరూపించుకోలేకపోయింది. ఇదే టీఆర్ఎస్ ను కలవర పరుస్తోంది. హైదరాబాదులో పెద్ద సంఖ్యలో వున్న సమైక్యవాదులు టీఆర్ఎస్ కు మద్దత్తుగా నిలవరని, దీంతో హైదారాబాదులో పట్టకావాలంటే మజ్లిస్ తో స్నేహం అత్యంత అవసరమని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. రానున్న బల్దియా ఎన్నికలలో మజ్లిస్ సహకారం లేకుండా మేయర్ స్థానం సంపాదించడం కష్టమని భావనతోనే ఎత్తగడ వేసింది. హైదరాబాదుపై శాంతిభద్రతల అధికారాలను కేంద్రం ఇప్పటికే గవర్నర్ కు అప్పగించింది. రానున్న బల్దియా ఎన్నికలలో హైదరాబాదులో టీడీపీ తన సత్తాను చాటితే.. తమ ఉనికికే ప్రమాదం వస్తుందని భావించిన టీఆర్ఎస్ మజ్లిస్ తో దోస్తి చేస్తోందన్న విమర్శలు వినబడుతున్నాయి. అందుకనే అచితూచి అడుగులు వేస్తున్న టీఆర్ఎస్ అధికారికంగా విమోచన దినాన్ని జరపడం లేదన్న అరోపణలు వున్నాయి.

టీడీపీతో కలసి సత్తా చాటేందుకు సిద్దమవుతున్న బీజేపి

అటు బీజేపి కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాజకీయంగా వాడుకోవాలని యోచిస్తోంది. గోల్కొండ కోటపై జాతీయ జెండాను అవిష్కరించి తమ సత్తాను చాటాలని భావిస్తోంది. మజ్లిస్ కన్నా నగరంలో తమకే అధిక బలముందని భావిస్తున్న బీజేపి.. మజ్లిస్ బలోపేతం కాకుండా కట్టడి చేయాలని భావిస్తోంది. టీడీపీతో స్నేహంతో రానున్న బల్దియా ఎన్నికలలో మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాదులో తమ సత్తాను చాటితే.. అది చూయించి తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తోంది. బీజేపితోనే కలసి వెళ్లి వచ్చే ఎన్నికలలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న టీడీపి కూడా పరిస్థితులన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.

విమోచన దినోత్సవంతో రాజకీయాలా..?

రాజకీయా పార్టీలన్ని విమోచన దినోత్సవంతో రాజకీయం చేస్తుంటే.. తెలంగాణ ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. పార్టీలు తమ పనితీరుతో ప్రజలు తమ వైపు ఆకర్షించుకోవాలే తప్ప.. చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచే రోజుతో రాజకీయాలు చేయవద్దని తెలంగాణవాదులు పార్టీలకు విన్నవిస్తున్నారు. అధికార, విపక్షాలు బలం పెంచుకునే పనిలో పవిత్రమైన రోజును కాలగర్భంలో కలపడం సహేతుకం కాదని వాదిస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు అన్ని ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని తెలంగాణవాదులు అభ్యర్థిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Home minister  Nayini NarsimhaReddy  TRS  BJP  MIM  Freedam  September 17  

Other Articles