ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఐస్ క్రీం సినిమా మీద ఒక వెబ్ సైట్ లో రాసిన రివ్యూ ఆయనను ఎంతగా బాధించిందో ఆయన మాటల్లో ద్యోతకమౌతోంది. "ఒక కేమెరాకు తలెక్కడో తోకెక్కడో కూడా తెలియకపోవటమే కాకుండా ఆ వెబ్ సైట్ లో వాడికి ఉద్యోగం లేకపోతే ఒక ప్రొడక్షన్ యూనిట్ లో టీ బాయ్ గా ఉండే అర్హత కూడా ఉండదనేది నా అభిప్రాయం కాదు- నా నమ్మకం" అంటూ ఆయన ఆవేదనను వ్యక్తం చేసారు. సదరు వెంకయ్య పుల్లయ్య డాట్ కామ్ లో రివ్యూ రాసినతన్ని లైవ్ డిబేట్ కి రమ్మని కూడా వర్మ సవాల్ చేసారు. అలా డిబేట్ కి రాకపోతే వాడు చీకట్లో అరిచే కుక్కతో సమానమని కూడా వర్మ అన్న మాటల్లో ఆయనకెంత ఈసడింపు కలిగిందో అర్థమౌతోంది.
జాతీయ స్థాయిలో పేరుగాంచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాటల్లో ఆవేదన, ఈసడింపు లాంటి భావాల కంటే నిజాయితీ ఎక్కువ కనిపిస్తోంది- తను నమ్మిన సినిమారంగం మీద వృత్తిపరంగా ఉన్న నిజాయితీ. తను నిర్మించిన సినిమాయే కాదు మరే సినిమా గురించైనా సరే ఆ విధమైన రివ్యూ చూసున్నా ఆయన అదేవిధంగా స్పందించేవారేమో!
ఒక సినిమా నిర్మాణం వెనుక ఎందరిదో ఎంతో శ్రమ దాగివుంటుంది. ఎంతో మంది అనుభం, సృజనాత్మకత, కళాత్మకత, పరిశ్రమ కలగలిసిన ఫలితమే ఒక చలనచిత్రం ఆవిర్భావం. అది తెర మీదకు రాకముందు ఎన్ని చేతులు, ఎన్ని మస్తిష్కాలు దానివెనక ఎన్ని నిద్రలేని రాత్రులను గడిపి, ఎన్ని ఆర్థిక సమస్యలను అధిగమించి పనిచేసాయో అర్థం చేసుకున్నవాడు ఆ సినిమా గురించి రివ్యూ రాస్తే దానికి ఎంతో సార్థకత ఉంటుంది కానీ వెంకయ్యో పుల్లయ్యో అండ్ కో డాట్ కామ్ ఇంట్లో కూర్చుని ఏమీ తెలియకుండా చేతికో కీబోర్డ్, మౌస్ దొరికాయి కదా అని తలా తోకా లేకుండా రాసిపడేస్తే దాన్ని రివ్యూ అనటం సరికాదు.
అది జర్నలిజం కాదు. దాన్ని ఎల్లో జర్నలిజం అంటారు. నిష్పక్షపాతంగా ఒక విషయాన్ని పాఠకులకు అందించటం కాకుండా మనసులో ఏదో పెట్టుకుని దానికనుగుణంగా రాయటం, తద్వారా వక్రమార్గంలో ప్రయోజనాలను ఆశించటాన్ని ఆ విధంగా ఎల్లో జర్నలిజం అని పిలుస్తారు. ఎల్లో జర్నలిజం లో జర్నలిజం అనే పేరు దాగున్నా అది మైసూర్ పాక్ లోని మైసూర్ లాంటిది. ఎందుకంటే అది జర్నలిజం కానే కాదు. జేబులు కొట్టేవాడు కూడా బస్సెక్కుతాడు కానీ అతని సంగతి తెలిసిన తర్వాత అతన్ని ప్రయాణీకుడు అనరు.
సినిమా పరిశ్రమకు ఎందరో శత్రువులున్నారు. అందులో పైరసీ చేసేవారు ఒక వర్గం వాళ్ళయితే, వేరే ప్రయోజనాన్ని ఆశించి రివ్యూ చేసేవారు కూడా మరో శత్రువర్గం వారే. పైరసీ చేసేవాళ్ళు సినిమా నిర్మాతల దగ్గర డబ్బులు గుంజుదామని ముందు చూస్తారు కానీ నిజంగా ఆ సిడిలను అమ్ముకోవటం వలన వచ్చే డబ్బుని ఆశించి కాదు. దొంగ సిడిలను ఒక్కోదాన్ని దొంగతనంగా అమ్మటానికి ఎంత టైం పట్టాలి, ఎంత వక్ర చాకచక్యం కావాలి. అదే తన దగ్గర పైరసీ సిడి ఉందని తెలిస్తే జరగబోయే నష్టాన్ని ఆపటానికి నిర్మాతలు కొన్ని డబ్బులు రాలిస్తే అది వాళ్ళ పనిని సులువు చేస్తుంది కదా అనే ఉద్దేశ్యంతో పైరసీలకు తలపెట్టే వాళ్ళున్నారు. ఈ ఎల్లో జర్నలిజం కూడా ఆ కోవకి చెందిందే. డబ్బులిస్తే రాసే రివ్యూ వేరు, ఇవ్వకపోతే చూపించే ఉక్రోషం వేరు. అంటే ఈ కోవకి చెందిన వారంతా పైరసీ చేసేవారు- కానీ లేకపోతే అడ్డదిడ్డంగా రివ్యూలు రాసే వెంకయ్యలు కానీ బ్లాక్ మెయిల్ చేసేవారంతా పరాన్నభుక్కులు- పేరసైట్స్. పైరసీ ప్లస్ అలాంటి వెబ్ సైట్లు కలిపితే పేరసైట్స్ అనుకోవచ్చు. పరాన్న భుక్కులు అడుక్కోవటం ఉండదు, సంపాదించటం ఉండదు కేవలం దోచుకోవటమే జరుగుతుంది.
ఇలాంటి రివ్యూరాయుళ్ళ వలన అటు సినీ నిర్మాతలకే కాదు ప్రేక్షకులకు కూడా నష్టం కలుగుతోంది. డబ్బులిచ్చిన వాళ్ళని పొగుడుతూ 5 కి 5 మార్కులు వేస్తే అది చూసి ఆ సినిమాకి పోయి ప్రేక్షకులు జేబులకు చిల్లి పెట్టించుకోవటం జరుగుతుంది. డబ్బులు ఇవ్వని సినిమాల మీద రాసిన అవాకులు చెవాకుల వలన మంచి సినిమాను పొగొట్టుకున్నవాళ్ళు కూడా అవుతారు. ఇలా ఈ జాతి రివ్యూ వెంకయ్యలు తమ పబ్బం గడుపుకోవటం కోసం కష్టపడి సినీరంగంలో కళాత్మకమైన వ్యాపారం చేసేవాళ్ల మీద పడి వాళ్ల నోటి దగ్గరిది లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
అసలేమిటీ రివ్యూ అంటే, ఎవరు దీనికి అర్హలు, ఎమిటీ రివ్యూ చేసే పద్ధతి?
మా పోర్టల్ లో రివ్యూ చెయ్యటానికో పద్ధతిని అనుసరిస్తాం. ఇద్దరు కాని ముగ్గురు కానీ మా పోర్టల్ నుంచి వెళ్ళి సినిమా చూస్తారు. వాళ్ళు తీసుకొచ్చిన రిపోర్ట్ నుంచి ఈ క్రింది విషయాలను పరిశీలించి ఎడిటర్ దాన్ని రివ్యూగా రూపొందిస్తారు.
1) సినిమా జెన్ర్- ఏ కోవకి చెందిన సినిమా ఇది ప్రేమ కథా, చారిత్రాత్మకమా, పౌరాణికమా, జానపదమా, విప్లవాత్మకమా, వినోదాత్మకమా, హాస్య ప్రధానమా, భక్తి ప్రధానమా అన్నది. 2) కథ, కధనం ఎలా ఉన్నాయి, 3) కథానాయకీ నాయకుల నటన, 4) ఇందులోని హాస్యం పాలు, 5) పాటలు, 6) పాటల రచన, 7) పాటల సంగీతం, 8) సంభాషణలు, 9) ఛాయాగ్రహణం, 10) ఔట్ డోర్ లొకేషన్స్, 11) ఎడిటింగ్, 12) కాస్ట్యూమ్స్, 13) సెట్టింగ్స్, 14) నృత్యాలు, 15) కేశాలంకరణ, 16) సినిమాటోగ్రఫీ, 17) పోరాటాలు, 18) కథలో నీతి లేక ఉద్దేశ్యం ఇత్యాది కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవలసివుంటుంది.
రివ్యూ చెయ్యటమంటే న్యాయనిర్ణేతలుగా వ్యవహరించటం. నిజానికి రివ్యూ రాయటానికో పద్ధతనేది ఎవరూ నిర్ణయించలేదు. కానీ పై పద్ధతిలో ఎవరికి వారు, సినిమాను చూసి దాని మీద సరైన, నిష్పక్షపాతమైన, తమ రచనా వృత్తికి న్యాయం చేస్తూ వెల్లడించిన రివ్యూని మాత్రమే వెల్లడిస్తే, అది నిజాయితీగా తమ పని తాము చేసినట్లవుతుంది.
అంతేకానీ తీసుకున్న డబ్బే మాట్లాడుతుంది, అదే మన చేత రాయిస్తుందని నమ్మే రివ్యూ వెంకయ్యలు దానికి రివ్యూ అని పేరు పెట్టినా, జేబు దొంగ టికెట్ తీసుకుని బస్ ఎక్కి తాను ప్రయాణీకుడినని చెప్పుకున్నట్లే.
రివ్యూలలోనే కాకుండా మామూలుగా కూడా వార్తలను ప్రచురించే వెబ్ పోర్టల్స్ లో హీరో హీరోయిన్ల గురించి చెడుగా రాస్తుంటారు. ఎవరి కష్టాలు ఏమిటో మనకేం తెలుస్తుంది దగ్గరగా వెళ్ళి చూడకపోతే? బట్టలు తక్కువగానో అసలు లేకుండానో గంతులెయ్యాలని ఎవరికుంటుంది? ఎవరు ఇష్టపడతారు? అలా చేస్తున్నారంటే వారిమీదున్న ఆ వత్తిడి ఏమిటో మనకేం తెలుసు? దేని వలన వారికి ఇష్టం లేకపోయినా అలా చేస్తున్నారో మనమెలా నిర్ణయించగలం?
దీనికి సమాధానం విద్యాబాలన్ నటించిన డర్టీ ఫిల్మ్ లో విద్యాబాలన్ చేతనే చెప్పించిన గొప్ప డైలాగ్ ఉంది.
"మీరు మీ ఆడవాళ్ళంతా డర్టీగా ఉండగూడదనే కోరుకుంటారు. నేను మాత్రం డర్టీగా ఉండాలనే ఆశిస్తారు. నేను డర్టీగా ఉన్నది మీ కోసం, మీ ఆనందం కోసం, మీ తృప్తి కోసం. నా నుంచి డర్టీగా ఉండాలని ఆశించేదే మీరు. ఇప్పుడు చెప్పండి ఎవరు డర్టీ మీరా నేనా. మీ మనసులు డర్టీగా లేవా?" ఇది ఆమె ఆ సినిమాలో చెప్పిన డైలాగ్ కి అనువాదం కాదు. ఇలాంటి పద్ధతిలో సాగుతుంది ఆమె ప్రసంగం ఆ సినిమాలో అందులో ఆమెకు ఆమె డర్టీ పాత్రకు అవార్డ్ వచ్చిన సందర్భంలో.
సినిమా ప్రేక్షకుల కోసం తమకి స్వతహాగా ఇష్టం లేకపోయినా దుష్ట పాత్రలను వెయ్యటం లేదూ? పిచ్చివాడుగా, దెబ్బలు తిన్నట్లుగా, చనిపోయినట్లుగా నటించటం లేదా? అలాగే దుస్తులు సరిగ్గా వేసుకోకుండా, లేకపోతే సగం సగం వేసుకుని, లేదా పూర్తిగా లేకుండా చెయ్యటమనేది పాత్రోచితంగా చేసేది. తనకోసం, తను చేస్తున్న సినిమా నిర్మాతల కోసం, సినిమా చూసే ప్రేక్షకుల కోసం. అంతేకానీ తమ మీద వ్యాఖ్యానాలు చేసే వాళ్ళు నోరుమూయించటానికి అరిచే కుక్కకో ఎముక విసిరినట్లు డబ్బులు విదిలించటానికి కాదు. అలాంటి వాళ్ళు నీతిమాలినవాళ్ళుగా పరిగణించి వాళ్ళమీద వ్యాఖ్యానాలు రాసిపడేస్తే మరి వారి దగ్గర ఆశించేవాళ్ళని ఏమనాలి?
మళ్ళీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విషయానికొస్తే,
ఆయన ఈ రివ్యూ చేసిన మనిషితో బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. ఆయనకంత అవసరం లేదేమో నిజానికి కానీ, ఈ విష సంస్కృతికి స్వస్థి పలకటానికే అయ్యుండాలి! ఎక్కడో ఒక మూలన కూర్చుని చేతికొచ్చింది రాసెయ్యటం, బుర్రలోకి వచ్చింది బరికెయ్యటం కాదు నిజంగా ప్రొఫెషనల్ అయితే బయటకు రా నాతో మాట్లాడు అని వర్మ సవాల్ చేస్తున్నారు.
ఇది నిజంగా మంచి అవకాశం ఆయనకు అంత ఆవేదన కలిగించే ఆ రివ్యూ రాసిన మనిషికి. తన నిజాయితీ (ఒకవేళ ఉంటే) చూపించుకోవటానికి చక్కని వేదికను వర్మ స్వయంగా సిద్ధం చేస్తున్నారు. దాన్ని ఉపయోగించుకోవచ్చు.
మాకే అలాంటి అవకాశం వస్తే మేము తప్పకుండా మా బృందంతో వెళ్ళి మేము రివ్యూ చేసే విధానాన్ని వివరించగలుగుతాము. ఎందుకంటే రివ్యూ రాయటంలో ఇదమిద్ధంగా ఒక పద్ధతంటూ లేకపోయినా జర్నలిజమ్ ఆధారంగా మేము తయారుచేసుకున్న సైంటిఫిక్ విధానంలో మేము రివ్యూ రాస్తాం. ఒకవేళ ఏ కారణం చేతనైనా అందుకు వీలు కలగకపోతే రాయటం మానేస్తాం కానీ పక్షపాతంతోనో, దురుద్దేశ్యంతోనో, మనసులో అనుకున్న విషయాన్ని సైట్ లోకి ఎక్కించే పని మాత్రం చెయ్యం.
ఇలాంటి ఆవేదనను లోగడ నటుడు శివాజీ కూడా ఒకసారి వెలిబుచ్చారు. ఆయన కూడా తన మనస్తాపాన్ని వెలిబుచ్చుతూ వర్మ వాడిన పదజాలాన్నే వాడారు. ఆ వీడియోని మరోసారి కింద చూడవచ్చు.
{youtube}Iq418e-gTvY|620|400|1{/youtube}
డబ్బు సంపాదించటానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ వక్రమార్గంలో చేసేది సంపాదన అనిపించుకోదు. అది డబ్బు రూపంలో రాబడే అయినా సంపాదన మాత్రం కాదు. Money received but not earned అవుతుంది. ఇప్పటికైనా అటువంటివారు తమ పద్ధతిని మార్చుకోకపోతే వాళ్ళు చేసేది జర్నలిజం కాకపోయినా, ఎల్లో జర్నలిజం అనిపించుకున్నా, మొత్తం జర్నలిజానికే మచ్చ తెస్తూ, ప్రతి జర్నలిస్ట్ నీ సందేహాత్మకంగా చూసే సందర్భాన్ని కల్పిస్తారనటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే చెడుకి అంత శక్తి ఉంది.
ఎటువంటి వివరణా లేకపోయినా ఆ వెంకయ్య వెబ్ సైట్ కనీసం బహిరంగంగా క్షమాపణ కోరుకున్నా సినిమా పరిశ్రమ నుంచి, సాటి జర్నలిస్ట్ ల నుంచి, సామాన్య ప్రజానీకం నుంచి కూడా క్షమార్హతను పొందుతారు. లేదంటే,
{youtube}k8fTpI1KoZ4|620|400|1{/youtube}
వర్మ ఇంకా ఇలా అన్నారు-
నాకు తెలిసి ఏ మాత్రం క్వాలిఫికేషన్ అక్కర్లేనిది రివ్యూవర్ జాబ్. కేవలం ఒక ప్రేక్షకుడిగా సినిమా చూసి నోటికొచ్చినట్టు వాగటమే రివ్యూ అయితే సినిమా చూసిన ప్రతివాడు రివ్యూయరేగా. కానీ కేవలం ఒక మ్యాగజైన్కో, వెబ్ సైట్కో పనిచేయడం మూలాన రివ్యూయర్ మాత్రం ఒక ప్రత్యేకమైన ప్రేక్షకుడిగా ఫీల్ అవుతాడు. నాకు తెలిసి చాలామంది సమీక్షకుల ద్వేషం నా సినిమాలకన్నా నా మీదే. అడిగితే అందులో కొందరు, మీ మీద ప్రేమ, ఇష్టం వల్ల మిమ్మల్ని ఉధ్ధరించడానికే ఇలా స్పందిస్తున్నాం అంటారు. కానీ ఆ సో కాల్డ్ ప్రేమని ఈమధ్య నేనొక ఎలర్జీలా ఫీల్ అవుతున్నాను.. నేను నా ఇష్టం వచ్చినట్టు ఎవర్నీ పట్టించుకోకుండా నా సినిమాలు నేను చేసుకుంటూ వెళ్లిపోతున్నాననే కుళ్లులోంచి పుట్టిన పగే వాళ్ల ఆ సో కాల్డ్ ప్రేమ కి అసలు కారణం. సినిమా అనేది కథ, పెర్ఫార్మన్సెస్ టేకింగ్, సౌండ్ మొదలైన అంశాల సమ్మేళనం. ఆ సమ్మేళనం ఒక డైరెక్టర్ చేతిలో తన సెన్సిబిలిటీలో ఉంటుంది. ఆ సెన్సిబిలిటీకి కనెక్ట్ అవ్వనప్పుడు సినిమా నచ్చక పోవచ్చు. సినిమా హిట్టా, ఫ్లాపా అని విశ్లేషించడానికి 3 కారణాలుంటాయి. ఎంత కాస్ట్ అయ్యింది, ఎంత రికవర్ అయ్యింది అనేది. ఎంతకి కొన్నారు, ఎంత వచ్చింది అనేది.. ఆ తరువాత ఒక ప్రేక్షకుడు ఆ సినిమా గురించి ఏమి ఫీల్ అయ్యాడు అనేది. పది మందిని అడిగితే పది రకాల అభిప్రాయాలు చెబుతారు. కానీ పేరు పేరున వేలమంది ఆడియన్స్ని అడగలేం కనుక కాస్ట్ వర్సెస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఒక సినిమాకి కరెక్ట్ కొలబద్ద. వ్యక్తిగతంగా కొందరికి సూపర్ హిట్ సినిమా కూడా నచ్చకపోవచ్చు. కొందరికి సూపర్ ఫ్లాప్ సినిమా కూడా నచ్చొచ్చు. కానీ చివరికి బాక్సాఫీస్ నిర్ణయమే తుది నిర్ణయం అని ఇండస్ట్రీ గురించి ఏ మాత్రం ఓనమాలు తెలిసినోడైనా చెబుతాడు. పాటలు, స్టార్లు, ఫైట్లు, కామెడీ లేకుండా ఒకే ఒక్క లొకేషన్లో తీసిన ‘ఐస్క్రీం’ అనే సినిమాకి సూపర్ ఓపెనింగ్ రావడమే అందరికి షాక్ ఇచ్చింది. దీని మూలాన నేను ప్రూవ్చేసిందేంటంటే ఆడియన్స్ని అట్రాక్ట్ చెయ్యడానికి ప్రొడక్షన్ వాల్యూస్ అవసరంలేదని, ‘ఐస్క్రీమ్’ కి మేము పెట్టిన ఖర్చెంతంటే కేవలం ఒక్క రోజు కలెక్షన్లతో ప్రొడ్యూసరు,డిస్ట్రిబ్యూటర్లు వాళ్ల పెట్టుబడి రికవర్ చేసుకున్నారు. నేను ఐస్ క్రీంలో ప్రవేశపెట్టిన ఫ్లో క్యాం, ఫ్లో సౌండ్ టెక్నాలజీ మున్ముందు ఒక ప్యారెలెల్ ఇండస్ట్రీని సృష్టిస్తుందని నా ప్రెడిక్షన్. నేను ఐస్ క్రీం లో ఇంట్రొడ్యూస్ చేసిన హై కాన్సెప్ట్-లో బడ్జెట్ ప్యారెలల్ సినిమాగానీ, గింబల్ రిగ్ గాని ఎప్పటికీ ఉండిపోతాయి. దీనికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేనిక్కడ రాసింది చదివివాళ్లు చేయగలిగేది కేవలం నా మీద ఇంకా రెట్టించిన ద్వేషంతో రెచ్చిపోయి రాయడం. నేను ఏనుగుని కాకపోవచ్చు కానీ ఆ సమీక్షకుడు మాత్రం ఖచ్చితంగా ఒక కుక్క. సింహం గర్జిస్తే భయపడతానేమో గానీచీకట్లోంచి మొరిగే కుక్క నాకు కేవలం చిరాకు తెప్పిస్తుంది... ఆఖరి మాటగా నేను చెప్పేదేంటంటే నేనిక్కడ రాసిందంతా కోపంతోనో ఆవేదనతోనో కాదు, కేవలం చిరాకుతో!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more